England: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు వీరాభిమాని... మ్యాచ్ చూసేందుకు పది నెలలు శ్రీలంకలోనే..!

England Cricket Super Fan Who Stucked 10 Months in Sri lanka

  • గత మార్చిలో కొలంబోకు వచ్చిన రాబ్ లూయిస్
  • టెస్ట్ సిరీస్ చూసేందుకు పది నెలలుగా అక్కడే
  • సెంచరీ తరువాత విష్ చేసిన రూట్

తమ తమ దేశాల క్రికెట్ జట్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అభిమానుల్లోనే వీరాభిమాని అనడంలో సందేహం లేదు. అతని పేరే రాబ్ లూయిస్. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి. శ్రీలంకలో ఇంగ్లండ్ ఆడే మ్యాచ్ లను చూడాలని భావించి, ఆటగాళ్ల కన్నా ముందుగానే వచ్చేసి, ఏకంగా పది నెలల పాటు అక్కడే ఇరుక్కుపోయి, చివరకు తన కల నెరవేర్చుకున్నాడు. అది కూడా మైదానం బయట నుంచి.

రాబ్ లూయిస్ స్టోరీని తెలుసుకుంటే... ఇంగ్లండ్ జట్టంటే చచ్చేంతగా ఇష్టపడే రాబ్, ఈ సంవత్సరం, మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్ మ్యాచ్ లను చూడాలని భావించి, కొలంబోకు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఈలోగా కరోనా వచ్చేసింది. దానితోపాటే ఆంక్షలూ అమల్లోకి వచ్చాయి. ఇంగ్లండ్ తో సీరీస్ వాయిదా పడుతూ వచ్చింది. విమానాలు లేకపోవడంతో రాబ్ సైతం ఎటూ వెళ్లలేని పరిస్థితి. కరోనా తగ్గగానే మ్యాచ్ లు జరుగుతాయని భావిస్తూ, శ్రీలంకలోని గాలేలోనే ఉండిపోయాడు.

వృత్తిరీత్యా వెబ్ డిజైనర్ అయిన రాబ్, బ్రిటన్ కరెన్సీతో పోలిస్తే, లంక కరెన్సీ విలువ తక్కువ కావడం, ఆన్ లైన్ లో ఆటలాడుతూ కాస్తో కూస్తో సంపాదించడంతో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా దాదాపు 10 నెలల పాటు సమయాన్ని గడిపేశాడు. చివరకు అతను కన్న కలలు నెరవేరాయి. గురువారం నాడు శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మొదలైంది.

ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడాలని రాబ్ భావించినా, ప్రేక్షకులకు అనుమతి లేకపోవడం, ఆటగాళ్లంతా బయో బబుల్ లో ఉండటంతో అతని ఆశలు అడియాసలయ్యాయి. అయినా పట్టు వదలని రాబ్ లూయిస్, మైదానానికి పక్కనే ఉన్న చడ్ ఫోర్ట్ ఎక్కేశాడు. అక్కడి నుంచే మ్యాచ్ ని తిలకించాడు. తన ఫేవరెట్ ఆటగాళ్లు బంతిని బౌండరీ దాటించినప్పుడెల్లా కేరింతలు కొట్టాడు. అతని గురించి ఇంగ్లండ్ ఆటగాళ్లకు ముందే తెలిసిపోయింది.

ఇక మ్యాచ్ లో భాగంగా శనివారం నాడు డబుల్ సెంచరీ చేసిన రూట్, రాబ్ లూయిస్ వైపు తిరిగి తన బ్యాట్ ను పెకెత్తి చూపించి, అతని అభిమానానికి తాను కూడా ఫిదా అయ్యానన్న సంకేతాలు పంపాడు. ఇంకేముంది?... రాబ్ ఆనందానికి అవధుల్లేవు. మిగతా ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా రాబ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సిరీస్ ముగిసిన తరువాత తన ఫేవరెట్ క్రికెటర్లతో కలిసి బీరు తాగాలని భావిస్తున్నానని రాబ్ ఇప్పుడు అంటున్నాడు.

  • Loading...

More Telugu News