Somu Veerraju: విగ్రహాల ధ్వంసంపై డీజీపీ వ్యాఖ్యలు సరికాదు: సోము వీర్రాజు
- విగ్రహాల ధ్వంసాలపై చర్యలు తీసుకోలేదు
- బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు
- వైసీపీ ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
- చర్చిల ఆస్తులనూ లెక్కించాలి
ఆంధ్రప్రదేశ్లో వరుసగా దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కేసులు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసం వెనుక బీజేపీ నేతలున్నారంటూ నిరాధార ఆరోపణలు చేసిన డీజీపీని పదవి నుంచి తొలగించాలని ఆయన అన్నారు.
విగ్రహాల ధ్వంసాలపై ఏ చర్యలు తీసుకోకపోవడమే కాకుండా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దారుణమని చెప్పారు. అసలు వైసీపీ ప్రభుత్వ లక్ష్యం ఏమిటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హిందూ మత సంస్థల ఆస్తులను లెక్కించినట్లే చర్చిల ఆస్తులనూ లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులను అరికట్టాలని ఆయన అన్నారు. హిందుత్వాన్ని అస్థిరపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోందని తెలిపారు.