USA: అమెరికా.. అడుగడుగునా సైనిక పహారా!

Biden inauguration All 50 US states on alert for armed protests

  • బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత
  • 50 రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ తో భారీ బందోబస్తు
  • వాషింగ్టన్ క్యాపిటోల్ లోకి వెళ్లకుండా సిమెంట్ దిమ్మెలు
  • తుపాకీ, 509 రౌండ్ల బుల్లెట్లతో ప్రవేశించిన వ్యక్తి అరెస్ట్
  • మేరీల్యాండ్, న్యూమెక్సికో, యూటాల్లో ఎమర్జెన్సీ

అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం చేయబోతున్న నేపథ్యంలో.. అమెరికా మొత్తం భద్రతా బలగాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కొద్ది రోజుల క్రితం ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు అమెరికా చట్టసభపై దాడికి ఒడిగట్టడం, నానా రభస సృష్టించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో మొత్తం 50 రాష్ట్రాల్లో బందోబస్తును ఏర్పాటు చేసింది.

రాజధాని వాషింగ్టన్ లో భారీగా బలగాలను మోహరించారు. 50 రాష్ట్రాల చట్ట సభల వద్దా బందోబస్తును భారీగా పెంచినట్టు అధికారులు చెప్పారు. క్యాపిటోల్ బిల్డింగ్ కు వెళ్లే దారులన్నింటినీ సిమెంట్ దిమ్మెలు పెట్టి బ్లాక్ చేశారు. ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ ఇనాగ్యురేషన్ వేడుక కోసం వేలాది మంది తరలివచ్చే నేషనల్ మాల్ ను మూసేశారు.

కాగా, నకిలీ ఐడీ కార్డు తీసుకుని క్యాపిటోల్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వర్జీనియాకు చెందిన అలెన్ బీలర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు క్యాపిటోల్ పోలీసులు ధ్రువీకరించారు. అతడి వద్ద నుంచి ఓ తుపాకీ, 509 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అతడిని విచారించగా ఓ ప్రైవేట్ భద్రతా సంస్థలో పనిచేస్తున్నట్టు తేలింది. తర్వాత అతడిని పోలీసులు వదిలిపెట్టారు.

కాగా, మేరీల్యాండ్, న్యూమెక్సికో, యూటా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆత్యయిక స్థితిని అమలు చేస్తున్నారు. కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, మిషిగన్, వర్జీనియా, వాషింగ్టన్, విస్కాన్సిన్ లో నేషనల్ గార్డ్స్ పహారా కాస్తున్నారు. శనివారం నుంచి బైడెన్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యేదాకా టెక్సస్ చట్టసభను మూసేశారు.

  • Loading...

More Telugu News