Salman Khan: కృష్ణజింకల వేట కేసు: ఫిబ్రవరి 6న కోర్టులో హాజరు కావాలంటూ సల్మాన్ ఖాన్ కు న్యాయమూర్తి ఆదేశాలు
- 1998లో జోథ్ పూర్ లో కృష్ణజింకల వేట
- ఇప్పటికీ కొనసాగుతున్న విచారణ
- సల్మాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన ట్రయల్ కోర్టు
- సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన సల్మాన్
రాజస్థాన్ లోని జోథ్ పూర్ అటవీప్రాంతంలో 1998లో రెండు కృష్ణజింకలను వేటాడిన కేసు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ఇప్పటికీ వదల్లేదు. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. కృష్ణజింకల వధకు సంబంధించిన ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సెషన్స్ కోర్టు నిన్న విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అయితే, శనివారం నాటి విచారణకు సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని కోర్టు సమ్మతించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సల్మాన్ తరఫున ఆయన న్యాయవాది నిశాంత్ బోరా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థను సెషన్స్ జడ్జి దేవేంద్ర కచ్వాహా ఆమోదించారు. అయితే, ఫిబ్రవరి 6న జరిగే తదుపరి విచారణకు మాత్రం సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.