Supreme Court: ఆఫ్ఘనిస్థాన్ లో కాల్పులు... ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తుల మృతి
- ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి కాల్పుల కలకలం
- కాబూల్ లో సుప్రీంకోర్టు జడ్జిలపై దాడి
- తాలిబాన్ పనే అయ్యుంటుందన్న పోలీసులు
- ఖండించిన తాలిబాన్లు
అటు ఉగ్రవాదం, ఇటు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండే ఆసియా దేశం ఆఫ్ఘనిస్థాన్ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రాజధాని కాబూల్ లో జరిగిన ఈ దాడిలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ సుప్రీంకోర్టులో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు వాహనంలో తమ కార్యాలయానికి వెళుతుండగా వారిపై కాల్పులు జరిగాయి.
కొందరు సాయుధులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఆ మహిళా జడ్జిలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. వారి వాహనం డ్రైవర్ కు కూడా తూటాలు తగిలాయి. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దాడి తాలిబాన్ల పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా, వారి ఆరోపణలను తాలిబాన్ సంస్థ ఖండించింది.