Wuhan: 2017లో ఓ గుహలో కరోనా సోకిన గబ్బిలాలు మమ్మల్ని కరిచాయి: అంగీకరించిన చైనా పరిశోధకులు
- వుహాన్ వైరాలజీ సంస్థ భద్రతా లోపాలు బట్టబయలు
- ఓ గుహలో గబ్బిలాల నుంచి నమూనాల సేకరణ
- సరైన జాగ్రత్తలు తీసుకోని పరిశోధకులు
- పరిశోధకులను కరిచిన గబ్బిలాలు
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాయేనని నిర్ధారించేందుకు మరింత బలమైన ఆధారం లభ్యమైంది. ప్రపంచ దేశాలకు కరోనా మహమ్మారి గురించి తెలిసింది గత ఏడాది నుంచే. కానీ చైనా 2017లోనే దీనిని గుర్తించింది. చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకులు కొందరు ఓ గుహలో కరోనా సోకిన గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా, వారిని గబ్బిలాలు కరిచాయి. ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. తమను కరోనా సోకిన గబ్బిలాలు కరిచినట్టు అంగీకరించారు. చేతికి రబ్బరు తొడుగులు ధరించినప్పటికీ ఓ గబ్బిలం కోర చేతికి గుచ్చుకుందని ఓ పరిశోధకుడు చెప్పాడు.
వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లో ఎంతో ప్రమాదకర వైరస్ లపై పరిశోధనలు జరుగుతుంటాయి. ఇంతటి అత్యున్నత స్థాయి పరిశోధన కేంద్రంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు పాటించకుండా, సరైన గ్లోవ్స్, మాస్కులు ధరించకుండా ఓ గుహలో నమూనాలు సేకరించారని ఈ ఘటన ద్వారా వెల్లడైంది. ప్రస్తుతం వుహాన్ లో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిపుణుల బృందం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.