BJP: ఆలయాలపై దాడులకు నిరసనగా ఫిబ్రవరి 4 నుంచి బీజేపీ-జనసేన యాత్ర
- ఆలయాలపై దాడి ఘటనల పట్ల బీజేపీ ఆగ్రహం
- కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర
- వారం రోజుల పాటు సాగనున్న యాత్ర
- దాడులకు గురైన ప్రాంతాల మీదుగా యాత్ర ఉంటుందన్న సోము
ఏపీలో ఆలయాలపై దాడుల ఘటనలు రాజకీయంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. విపక్షాలు ఈ ఘటనపై ఏపీ సర్కారును నిందిస్తుండగా, విపక్షాల కుట్రేనంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆలయాలపై దాడులకు నిరసనగా ఫిబ్రవరి 4న బీజేపీ, జనసేన పార్టీ యాత్ర చేపడుతున్నాయి. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు ఈ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
దేవాలయాలు దాడులకు గురైన ప్రాంతాల మీదుగా ఈ యాత్ర ఉంటుందని వివరించారు. నెల్లూరు, శ్రీశైలం, విజయవాడ, పిఠాపురం, అంతర్వేది వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. వారం పాటు సాగే ఈ యాత్ర ద్వారా ప్రజల హృదయాలకు చేరువయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే హిందువులను అడ్డుకున్నట్టేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.