Kurnool District: డోన్‌లో కత్తులు, రాళ్లతో కొట్టుకున్న వైసీపీ శ్రేణులు

Two groups in YSRCP  attacked each other in Kurnool dist
  • నాగరాజు, ఫరీద్ వర్గాల మధ్య ఘర్షణ
  • మట్కా, మద్యం విషయంలో ఆధిపత్య పోరు
  • ఇరు వర్గాల్లోని యువకులకు గాయాలు
కర్నూలు జిల్లా డోన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన గొడవతో స్థానికులు హడలెత్తిపోయారు. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకోవడంతో జనం భయంతో వణికిపోయారు. పోలీసుల జోక్యంతో ఘర్షణకు ఫుల్‌స్టాప్ పడింది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాతపేటకు చెందిన ఫరీద్, నాగరాజు వర్గాలకు చెందిన యువకులు రోడ్లపైకి వచ్చి కత్తులు, రాళ్లతో ఘర్షణకు దిగారు. అరగంటపాటు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో ఒక వర్గంలోని నాగరాజు, కిశోర్, కిరణ్‌లు, మరొక వర్గంలోని ఫరీద్, వలీ గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన నాగరాజును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైసీపీకే చెందిన నాగరాజు, ఫరీద్‌లు వేర్వేరుగా వర్గాలుగా విడిపోయారు. మట్కా, మద్యంపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి. నిన్న సాయంత్రం ఘర్షణ కూడా ఇందులోనే భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది. పాత కక్షలతో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు యువకులు తొలుత ఘర్షణ పడగా, ఆ తర్వాత ఇరు వర్గాల వారు అక్కడికి చేరుకుని రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు.
Kurnool District
Dhone
YSRCP
Andhra Pradesh

More Telugu News