Facebook: ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు

parliamentary panel summons facebook and twitter
  • వాట్సాప్ కొత్త పాలసీ విధానంపై చర్చించిన పార్లమెంటరీ ప్యానెల్
  • సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై చర్చించాలని కోరిన స్టాండింగ్ కమిటీ
  • తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం
వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుండడంతో స్పందించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో మహిళల భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశం కావాలని పేర్కొన్న స్టాండింగ్ కమిటీ.. కొత్త పాలసీ విధానంపై వస్తున్న ఆరోపణలపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదం నేపథ్యంలో నిన్న సమావేశమైన పార్లమెంటు సమాచార, సాంకేతిక స్టాండింగ్ కమిటీ అనంతరం సామాజిక మాధ్యమ దిగ్గజాలకు సమన్లు జారీ చేసింది.

వాట్సాప్ ఇటీవల తమ వినియోగదారులందరికీ కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన పాప్ అప్ మెసేజ్‌లు పంపింది. కొత్త పాలసీని అందరూ అంగీకరించాల్సిందేనని, లేకుంటే ఖాతా డిలీట్ అయిపోతుందని హెచ్చరించింది. అంతేకాదు, వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని తెలిపింది. ఫిబ్రవరి 8 నుంచే ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

అయితే, వాట్సాప్ ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. వాట్సాప్ కొత్త విధానం నచ్చని చాలామంది సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మళ్లారు. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన వాట్సాప్.. అందరి సమాచారాన్ని పంచుకోబోమని, కేవలం బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే పంచుకుంటామని తెలిపింది. అయినా, విమర్శలు తగ్గకపోవడంతో కొత్త విధానాన్ని మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
Facebook
Twitter
Whatsapp
parliamentary standing commitee

More Telugu News