Narendra Singh Tomar: రేపు రైతులతో పదో విడత చర్చలు... రైతులు పంతం వీడాలంటున్న కేంద్రం!
- చట్టాల రద్దు మాత్రం కుదరదు
- మిగతా అంశాలపై చర్చకు ఓకే
- కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
- ట్రాక్టర్ ర్యాలీ ఆగబోదన్న రైతులు
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన సాగు చట్టాల రద్దును కోరుతూ న్యూఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతుల ప్రతినిధులతో మంగళవారం నాడు పదో విడత చర్చలు జరగనున్నాయి. చట్టాల రద్దు మినహా, మిగతా అన్ని అంశాలపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రైతులు ఇప్పటికైనా పంతం వీడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తు చేసిన ఆయన, ఇప్పటికైనా రైతులు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి నిరసనలకు స్వస్తి పలకాలని సూచించారు.
తాజాగా మధ్య ప్రదేశ్ లోని మొరెనాలో పర్యటించిన ఆయన, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని, మనస్ఫూర్తిగా రైతు నేతలను చర్చలకు పిలుస్తున్నామని, రైతుల ఆదాయం పెంచేందుకు పలు రాయితీలను కూడా ఇవ్వనున్నామని ఆయన అన్నారు. ఈ చట్టాలు దేశం మొత్తానికి వర్తిస్తాయని వ్యాఖ్యానించిన తోమర్, చాలా రాష్ట్రాల రైతులు, సంబంధిత వర్గాల మద్దతు ఎన్డీయే ప్రభుత్వానికి ఉందని అన్నారు.
సాగు చట్టాల రద్దు మినహా మండీలు, వ్యాపారుల రిజిస్ట్రేషన్ సమస్యలతో పాటు పంట వ్యర్థాల దహనం, విద్యుత్ వంటి అన్ని అంశాలపైనా రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళవారం జరిగే సమావేశానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కూడా హాజరు కానున్నారని అన్నారు.
ఇదిలావుండగా, జనవరి 26న తాము ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని జరిపే తీరుతామని రైతులు స్పష్టం చేశారు. తమ ర్యాలీని ప్రశాంతంగా నిర్వహిస్తామని, గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎటువంటి ఆటంకాలనూ కలిగించబోమని, ట్రాక్టర్లపై జాతీయ జెండాలనే ప్రదర్శిస్తామని రైతు సంఘం నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దానిపై నేడు విచారణ జరగనుంది.