Bird Flu: కాకులు, గుడ్లగూబలు, పావురాల్లోనూ బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు: కేంద్రం
- పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం సరికాదు
- వ్యాధి లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చు
- తప్పుడు ప్రచారం వల్ల రైతులు నష్టపోతారు
బర్డ్ ప్లూ నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం సరికాదని, ఈ విషయంలో పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అలాగే, బర్డ్ ఫ్లూ లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. బర్డ్ ఫ్లూ కారణంగా మహారాష్ట్ర, హరియాణాల్లో పౌల్ట్రీ కోళ్లను వధిస్తున్నారని, ముంబై, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయని కేంద్రం నిన్న తెలిపింది. బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో ఇది ఒక్క కోళ్లకే పరిమితం కాలేదని.. కాకులు, గుడ్లగూబలు, పావురాల్లోనూ ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపించాయని పేర్కొంది.
మరోవైపు, ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని కేంద్ర పశుసంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ, రైతులు నష్టపోతారని పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు చత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లలో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. బర్డ్ ఫ్లూపై అధ్యయనానికి కేంద్రం నియమించిన నిపుణుల బృందం బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.