Seoul Court: అవినీతి కేసులో శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్ కు జైలుశిక్ష
- లంచం ఆరోపణలపై 2017లో లీ జే యాంగ్ అరెస్ట్
- శిక్ష విధించిన న్యాయస్థానం
- అప్పిలేట్ కోర్టుకు వెళ్లిన యాంగ్
- శిక్ష నిలుపుదల
- తీర్పును సమీక్షించాలంటూ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు
- రెండున్నరేళ్లు శిక్ష విధించిన సియోల్ హైకోర్టు
చట్టం పకడ్బందీగా అమలు చేస్తే ఎంతటివారైనా తప్పించుకోలేరనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్ (52)కు అవినీతి కేసులో జైలుశిక్ష పడింది. శాంసంగ్ గ్రూప్ అధినేత లీ కున్ హీ పెద్ద కుమారుడే లీ జే యాంగ్. శాంసంగ్ గ్రూప్ కు వైస్ చైర్మన్ కూడా. ప్రభుత్వం నుంచి లబ్ది పొందేందుకు లీ జే యాంగ్ అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్ గుయిన్ హై కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు.
2017లో ఆయనను అరెస్ట్ చేయగా, కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై లీ జే యాంగ్ అప్పిలేట్ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పిలేట్ కోర్టు ఈ శిక్షను నిలుపుదల చేసింది. 2019లో ఈ కేసు సుప్రీంకోర్టుకు విచారణకు వచ్చింది. అప్పిలేట్ కోర్టు తీర్పును సమీక్షించాలంటూ సుప్రీంకోర్టు సియోల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన సియోల్ హైకోర్టు లీ జే యాంగ్ కు రెండున్నర సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది.