Vijayashanti: ఏ సమస్య వచ్చినా చేతులు ముడుచుకునే టీఆర్ఎస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి: విజయశాంతి
- పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై విజయశాంతి స్పందన
- అమ్మాయిలు స్కూళ్లకు దూరమవుతున్నారని వెల్లడి
- మీడియాలోనూ కథనాలు వచ్చాయని వివరణ
- తెలంగాణ సర్కారు విఫలమవుతోందని వ్యాఖ్యలు
బీజేపీ నేత విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. ఏ సమస్య వచ్చినా చేతులు ముడుచుకుని కూర్చునే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడమే కానీ, ఆ నిర్ణయాల అమలుకు తగిన ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉందని విమర్శించారు. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని తరగతుల కోసం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు కానీ, కరోనా నిబంధనలను అమలు చేసే పరిస్థితి మాత్రం కనిపించడంలేదని పేర్కొన్నారు.
"తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వందలాది స్కూళ్లలో నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. దానికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఈ సమస్యలు అమ్మాయిల పాలిట బాగా ఇబ్బందికరంగా మారాయి. దీనికి సంబంధించి మీడియాలోనూ కథనాలు వచ్చాయి. గణాంకాలతో సహా పేర్కొన్నారు. ఈ సమస్యల కారణంనే అమ్మాయిలు పాఠశాలలకు దూరమవుతున్నారు. బాలికల డ్రాపౌట్లు పెరగడానికి ఇదే కారణం" అని వివరించారు.
"కరోనా వ్యాప్తికి ముందే ఈ సమస్యలున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిపై స్పందించలేదు. ఆనాడే ఏమీ చెయ్యని ప్రభుత్వం ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో చేతులెత్తెయ్యడం తప్ప ఈ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న ఆశలు కలగడంలేదు. ఇవేకాదు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, వసతిగృహాల్లో సౌకర్యాల లేమి వంటి మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. పరిస్థితులు బాగున్నప్పుడే విద్యావ్యవస్థ మెరుగుదలపై దృష్టి సారించని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదు" అంటూ నిశిత విమర్శలు చేశారు.