TRS: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ రెడీ.. లక్షన్నర మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
- ఈ నెల 22-24 మధ్య బహిరంగ సభ
- సభపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం
- సభ నిర్వహణ బాధ్యత కర్నె ప్రభాకర్ తదితరులకు అప్పగింత
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నేపథ్యంలో అప్రమత్తమైన టీఆర్ఎస్, నాగార్జునసాగర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఈ నెల 22-24 తేదీల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయమై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేసీఆర్ సభకు లక్షన్నర మందిని సమీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం కేటీఆర్‌ను కలిసి సభ విషయమై చర్చించారు. అలాగే, శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలోనూ సభ, జన సమీకరణ అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది.
సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, సోమ భరత్‌కుమార్ గుప్తా తదితరుల నేతృత్వంలోని కమిటీకి అప్పగించినట్టు సమాచారం.