COVID19: కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్​ వో, చైనా అలసత్వం ప్రదర్శించాయి: స్వతంత్ర దర్యాప్తు సంస్థ

China and WHO acted too slowly to contain Covid19 says independent panel

  • తెలిసిన వెంటనే స్పందించలేదని అసహనం
  • రక్షణ చర్యలేవీ చేపట్టలేదని మండిపాటు
  • ప్రపంచ దేశాలకు విస్తరించాక డబ్ల్యూహెచ్ వో స్పందించిందని ఆరోపణ

కరోనా కట్టడి విషయంలో చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలు చాలా ఆలస్యంగా స్పందించాయని స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒకటి పేర్కొంది. ముందే స్పందించి చర్యలు తీసుకునే ఉంటే పరిస్థితి ఇంత తీవ్రమయ్యేది కాదని అభిప్రాయపడింది. స్విట్జర్లాండ్ కు చెందిన ప్యాండెమిక్ ప్రిపేర్డ్ నెస్ అండ్ రెస్పాన్స్ అనే స్వతంత్ర కమిటీ దానిపై సోమవారం నివేదిక విడుదల చేసింది.

 న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎలెన్ జాన్సన్ సర్ లీఫ్ వంటి వారు కమిటీ సహ చైర్ పర్సన్ లుగా ఉన్నారు. వుహాన్ లో మొదటి కేసు బయటపడగానే దాని కట్టడికి చైనా ప్రభుత్వం అవసరమైన ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుని ఉండాల్సిందని పేర్కొంది.

2019 డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 29 మధ్యే కరోనా మొదటి కేసులు నమోదైనట్టు వుహాన్ సిటీ అధికారులు చెబుతున్నారని, కానీ, ఆ ఏడాది డిసెంబర్ 31 దాకా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దానిపై సమాచారమే ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేసింది. 2020 జనవరి 23న వుహాన్ లో లాక్ డౌన్ పెట్టినా.. అప్పటికే జపాన్, దక్షిణ కొరియా, థాయ్ ల్యాండ్, అమెరికా వంటి దేశాలకు మహమ్మారి విస్తరించిందని చెప్పింది.

డబ్ల్యూహెచ్ వో కూడా సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం చేయలేదని ఆరోపించింది. డిసెంబర్ లోనే మహమ్మారి గురించి తెలిసినా జనవరి 22 దాకా అత్యవసర కమిటీ మీటింగ్ నిర్వహించలేదని మండిపడింది. ప్రపంచ దేశాలకు కరోనా విస్తరించాక జనవరి 30న అంతర్జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించిందని వెల్లడించింది. కరోనా మహమ్మారిపై డబ్ల్యూహెచ్ వో ఇంత ఆలస్యం ఎందుకు చేసిందన్నది అంతుబట్టని విషయమని పేర్కొంది. కరోనాను మహమ్మారిగా ప్రకటించేందుకు మార్చి 11 దాకా ఎందుకు ఆగాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షా 18 వేల కేసులు నమోదైతే.. 4 వేల మంది దాకా చనిపోయారని పేర్కొంది. 'అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు 2005'లో మహమ్మారి అనే పదం లేకపోయినా.. ముందే మహమ్మారి అని ప్రకటించి ఉంటే ప్రపంచ దేశాలు, ప్రజలు మరింత అప్రమత్తమయ్యే వారని పేర్కొంది.

  • Loading...

More Telugu News