Vishnu Vardhan Reddy: వైసీపీ ఎమ్మెల్యేలు బరితెగించారు... ఐపీఎస్ లను బెదిరించడం దారుణం: విష్ణువర్ధన్ రెడ్డి

BJP General Secretary Vishnu Vardhan Reddy reacts to Nallapureddy Prasannakumar Reddy comments

  • నెల్లూరు జిల్లా ఎస్పీకి నల్లపురెడ్డి హెచ్చరికలు
  • తీవ్రంగా తప్పుబట్టిన విష్ణువర్ధన్ రెడ్డి
  • మీ ప్రభుత్వ కాలపరిమితి 60 నెలలే అని వెల్లడి
  • ఐపీఎస్ లు 60 ఏళ్ల వరకు పదవిలో ఉంటారని వివరణ

కోవూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై తీవ్ర హెచ్చరికలు చేయడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్ష ఎమ్మెల్యేలు బరితెగించారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఐపీఎస్ అధికారులను బెదిరిస్తుంటే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయరని ప్రశ్నించారు.

"నాలుగు రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తాను, ఆరు రోజుల్లో పంపించేస్తాను అని బెదిరిస్తున్నారు... కానీ ప్రజలు ఈ ప్రభుత్వానికి 60 నెలల కాలపరిమితి మాత్రమే ఇచ్చారన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు 60 ఏళ్ల వయసు వరకు పదవిలో ఉంటారు.

60 నెలలు ఉండే మీరు గొప్పవాళ్లా, లేక 60 ఏళ్ల వరకు ఉండే పోలీసులు గొప్పవాళ్లా? అలాంటివాళ్లను మీరు బెదిరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎస్పీ భాస్కర్ భూషణ్ పై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే అతనిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఏమైనా వైసీపీగా మారిపోయిందా? లేకపోతే భారత రాజ్యాంగ పరిధిలో ఈ వైసీపీ నేతలకు ఐపీసీ వర్తించదా? ఎంత అహంకారం... ఎంత అధికార మదం ఇది?" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News