Narendra Modi: ఆ పట్టుదల, ఆ దృఢసంకల్పం అమోఘం... టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన
- బ్రిస్బేన్ లో భారత్ జయభేరి
- ఆసీస్ పై టెస్టు సిరీస్ కైవసం
- టీమిండియాపై ప్రశంసల వెల్లువ
- శుభాభినందనలు తెలిపిన మోదీ
- మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు అద్వితీయమైన రీతిలో టెస్టు సిరీస్ ను చేజిక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు జైత్రయాత్రను అందరం బాగా ఆస్వాదించామని తెలిపారు. ఈ పర్యటన ఆసాంతం భారత ఆటగాళ్ల తపన, తరగని ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించాయని వెల్లడించారు. ఉక్కులాంటి సంకల్పం, సడలని దీక్ష కూడా ప్రస్ఫుటమయ్యాయని మోదీ వివరించారు. ఈ సందర్భంగా టీమిండియాకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్ లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
36 ఆలౌట్ ఎక్కడ... సిరీస్ నే గెల్చుకోవడం ఎక్కడ?: విజయసాయి విస్మయం
ఆసీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో మొదట అడిలైడ్ లో పింక్ బాల్ తో డే నైట్ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 36 కు ఆలౌట్ అవడమే కాదు, మ్యాచ్ ను కూడా కోల్పోయింది. అయితే చివరికి 2-1తో టెస్టు సిరీస్ లో టీమిండియానే విజేతగా నిలవడం అపూర్వం అని చెప్పాలి. దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. గొప్పగా పుంజుకోవడం అంటే ఇదేనని ట్వీట్ చేశారు. ఓ మ్యాచ్ లో 36 పరుగులకే ఆలౌట్ అవడం ఎక్కడ... పెద్ద ఆటగాళ్లు లేకుండానే ఏకంగా సిరీస్ నే చేజిక్కించుకోవడం ఎక్కడ అంటూ వ్యాఖ్యానించారు. భారత ఆటగాళ్లు ఈ సిరీస్ లో ఓ జట్టుగా అసమాన స్ఫూర్తి ప్రదర్శించారని కొనియాడారు.
అటు, విపక్షనేత చంద్రబాబునాయుడు స్పందిస్తూ, టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా కంచుకోట గబ్బాలో చిరస్మరణీయ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్నారని ప్రశంసించారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా టీమిండియా ఘనవిజయం పట్ల ట్వీట్ చేశారు. మరోసారి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గబ్బాలో జయకేతనం ఎగురవేశారని, 2-1తో సిరీస్ ను వశం చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఆ మైకంలోనే ఉన్నానని, ఈ రోజును చాన్నాళ్లు గుర్తుంచుకుంటానని అన్నారు. ఎనలేని సంతోషం కలుగుతోందని, టీమిండియా నమోదు చేసిన విజయం పట్ల గర్విస్తున్నానని మహేశ్ పేర్కొన్నారు.