Devineni Uma: వీళ్లని పశువులతో పోల్చడానికి కూడా పనికిరారు: దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు
- పమిడిముక్కల పీఎస్ నుంచి ఉమ విడుదల
- అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ
- కొడాలి నానికి చదువు సంస్కారంలేదని విమర్శలు
- హూ కిల్డ్ బాబాయ్ అంటూ సీఎం జగన్ పైనా వ్యాఖ్యలు
- జగన్ పారిపోయారని ఎద్దేవా
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ మంత్రి కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూతుల మంత్రి కాస్తా ఇవాళ పోరంబోకు మంత్రి అయ్యాడని విమర్శించారు. కొడాలి నానికి చదువుతో పాటు సంస్కారం కూడా లేదని, అందువల్ల పశువులతో పోల్చడానికి కూడా పనికిరారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వంటి పెద్ద వయస్కుడ్ని, ఇతర టీడీపీ నేతలను ఆడిపోసుకుంటున్నారని మండిపడ్డారు. గొల్లపూడి వచ్చి కొడతాం, బడితె పూజ చేస్తాం అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కొడాలి నాని మాట్లాడిన భాషను నిరసిస్తూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానంటే వందల సంఖ్యలో పోలీసులను మోహరించి అడ్డుకున్నారు. అక్కడ 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటే ఎమ్మెల్యేలు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేయడం, మమ్మల్ని బూతులు తిట్టడం కూడా జరిగింది. వీటన్నింటికి సీఎం జగన్ సమాధానం చెప్పాలి" అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, "హూ కిల్డ్ బాబాయ్?" అంటూ మొన్న పరిటాలలో కార్యకర్తలు చంద్రబాబు గారికి ఓ మాట అందించారని దేవినేని ఉమ వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డిపై గొడ్డలి దెబ్బలు ఎవరు వేశారు? అంటూ సీబీఐ విచారణ కావాలన్న జగన్ ఎందుకు పారిపోయారని ఉమ నిలదీశారు. "బాబాయ్ ఏమో గొడ్డలి దెబ్బలకు పోయాడు, మామ ఏమో ఆసుపత్రిలో పోయాడు. ఇప్పుడీ హూ కిల్డ్ బాబాయ్? కూడా వచ్చేసరికి ఇవన్నీ తట్టుకోలేక జగన్ పారిపోయారు అని ఉమ ఎద్దేవా చేశారు.
"జగన్ ఉడత ఊపులకు మేం భయపడ్డామని బూతుల మంత్రి అంటున్నాడు. ఉడత ఊపులకు భయపడింది ఎవరు? దేనికీ భయపడకపోతే ఇవాళ ఢిల్లీలో అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు జగన్ ఎందుకు వెళ్లాడు? ఇవన్నీ ప్రశ్నిస్తే చంపేస్తారా? దాడులు చేస్తారా? మీ దుర్మార్గాలకు, తప్పుడు కేసులకు టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ భయపడరు. టీడీపీ కార్యకర్త పార్టీ జెండా కప్పుకుని చచ్చిపోతాడే తప్ప, కొడాలి నాని లాగా, వంశీ లాగా, కృష్ణప్రసాద్ లాగా పార్టీకి ద్రోహం చేసి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం కాదు" అని ఉమ స్పష్టం చేశారు.