Jagan: మూడు దశాబ్దాల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా కంచుకోటను బద్దలు కొట్టారు... శభాష్ టీమిండియా: సీఎం జగన్
- బ్రిస్బేన్ లో భారత్ ఘనవిజయం
- స్పందించిన సీఎం జగన్
- అద్భుత విజయం అంటూ వ్యాఖ్యలు
- దేశం గర్వించేలా చేశారని కితాబు
- చారిత్రాత్మక విజయం అంటూ పవన్ ప్రకటన
ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన టెస్టు సిరీస్ విజయంతో దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువ టీమిండియా నమోదు చేసిన ఘనత పట్ల ఏపీ సీఎం జగన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎంతటి అద్భుత విజయం ఇది అంటూ ట్విట్టర్ లో స్పందించారు. మూడు దశాబ్దాల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా కంచుకోటను బద్దలు కొట్టిన టీమిండియాకు హృదయపూర్వక శుభాభినందనలు అని పేర్కొన్నారు. పట్టుదల, పరాక్రమం చాటుతూ తిరుగులేని ప్రదర్శన కనబర్చారని సీఎం జగన్ కితాబునిచ్చారు. ఇవాళ టీమిండియా తన ఘనతతో దేశం మొత్తం గర్వించేలా చేసిందని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలుపు ఓ అద్భుతం: పవన్ కల్యాణ్
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై వారి సొంతగడ్డ మీదే టెస్టు సిరీస్ సాధించడం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బ్రిస్బేన్ మైదానంలో జరిగిన టెస్టులో భారత్ గెలిచిన తీరు ఓ అద్భుతం అని అభివర్ణించారు. ఈ ఘనత సాధించిన భారత జట్టుకు తన తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా, అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, కలసికట్టుగా గెలుపుకోసం పోరాడిన తీరు ప్రశంసనీయం అని తెలిపారు.