Dr Santha: అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత
- చెన్నైలో తుదిశ్వాస విడిచిన డాక్టర్ శాంత
- గతరాత్రి చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి
- ప్రముఖుల నివాళులు
ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ పద్మవిభూషణ్ డాక్టర్ వి. శాంత చెన్నైలో కన్నుమూశారు. ఆమె దేశంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత రాత్రి గుండెపోటుకు గురైన డాక్టర్ శాంత చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 93 సంవత్సరాలు.
డాక్టర్ శాంత ఎంతో ఘన నేపథ్యం ఉన్న వ్యక్తి. ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డు గ్రహీతలైన సర్ సీవీ రామన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ల కుటుంబం నుంచి వచ్చిన ఆమె చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఉన్నత స్థానానికి ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. మొదట్లో పూరి పాకల్లో మొదలైన అడయార్ క్యాన్సర్ చికిత్స కేంద్రం ఇవాళ దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది. అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఖ్యాతి విదేశాలకు కూడా పాకింది.
డాక్టర్ శాంత మరణవార్తతో ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. నిస్వార్థమైన వ్యక్తి అని, ఆమెను కలవడం గౌరవంగా భావిస్తున్నానని హీరోయిన్ త్రిష పేర్కొంది. మనుషుల మధ్యలో ఉన్న దేవత మనల్ని వీడి వెళ్లిపోయిందంటూ హీరో సిద్ధార్థ్ పేర్కొన్నాడు.