Team India: 100వ టెస్టు ఆడిన ఆసీస్ ఆటగాడు నాథన్ లైయన్ కు టీమిండియా కానుక
- 100వ టెస్టు ఆడిన లైయన్
- భారత ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీ బహూకరణ
- రహానే నుంచి జెర్సీ అందుకున్న లైయన్
- టీమిండియాపై ప్రశంసల జల్లు
సాధారణంగా ఏదైనా సిరీస్ లో గెలిచిన జట్టు సంబరాల్లో మునిగిపోతుంది. ఓడిన జట్టు గురించి పట్టించుకునేవాళ్లే ఉండరు! కానీ, ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియా అందుకు మినహాయింపు అని చెప్పాలి. అజింక్యా రహానే నాయకత్వంలోని భారత్ జట్టు ఆసీస్ జట్టులోని నాథన్ లైయన్ పట్ల ఎంతో గౌరవభావం ప్రదర్శించింది.
గత కొంతకాలంగా ఆస్ట్రేలియా జట్టు స్పిన్ బాధ్యతలు మోస్తున్న 33 ఏళ్ల నాథన్ లైయన్ కు బ్రిస్బేన్ టెస్టు 100వ మ్యాచ్. అయితే, వందో టెస్టు గెలిచి చిరస్మరణీయం చేసుకోవాలన్న అతని ఆశలు నెరవేరలేదు. కానీ, టీమిండియా ఆటగాళ్లు మాత్రం లైయన్ ప్రతిభను గుర్తించారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత లైయన్ కు ఓ కానుక అందజేశారు. జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని టీమిండియా కెప్టెన్ రహానే... లైయన్ కు బహూకరించాడు. ఆ జెర్సీని అందుకున్న లైయన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. భారత జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు.
దీనిపై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు రహానే, ఇతర టీమిండియా ఆటగాళ్ల సహృదయతను కొనియాడారు. కాగా, బ్రిస్బేన్ టెస్టుతో కలిపి కెరీర్ లో ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన లైయన్ 399 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 8/50 కాగా... ఐదేసి వికెట్లను 18 సార్లు సాధించాడు.