Nara Lokesh: జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు: లోకేశ్
- అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు
- వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు
- మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మీ నారాయణ పొలంలోనే ఆత్మహత్య
- మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్సూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని వైఎస్ జగన్ ఘోరంగా మోసం చేశారు' అని విమర్శించారు.
'కృష్ణా జిల్లా,చందర్లపాడులో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మీ నారాయణ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదు' అన్నారు.
'వైకాపా అభిమాని అయిన కౌలు రైతు లక్ష్మీనారాయణ జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలి' అంటూ డిమాండ్ చేశారు.