COVID19: ఆరు దేశాలకు ఉచితంగా దేశీయ వ్యాక్సిన్లు సరఫరా

Bhutan and Maldives first among 6 recipients of Covid vaccine from India

  • కేంద్ర ప్రభుత్వం ప్రకటన
  • భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ లకు సరఫరా
  • మున్ముందు మరిన్ని దేశాలకూ అందిస్తామని వెల్లడి
  • ఆరు దేశాలకు వ్యాక్సినేషన్ పై శిక్షణ

మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉచితంగా సరఫరా చేయనుంది. ఆరు దేశాలకు టీకాలను అందించనుంది. ఈ మేరకు మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ లకు బుధవారం నుంచి వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నట్టు చెప్పింది. శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, మారిషస్ లు వ్యాక్సిన్లకు ఇంకా రెగ్యులేటరీ అనుమతులు ఇవ్వలేదని, వచ్చాక దశల వారీగా ఆయా దేశాలకూ టీకాలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

మన అవసరాలు పోనూ మరికొన్ని వ్యాక్సిన్ డోసులను భాగస్వామ్య, పొరుగు దేశాలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే సంస్థలకు సూచించామని చెప్పింది. రాబోయే రోజుల్లో దశల వారీగా మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను అందజేస్తామని వెల్లడించింది. కాగా, టీకాల సరఫరాకు ముందు మొదటి విడతలో వాటిని అందుకుంటున్న ఆరు దేశాలకు వ్యాక్సినేషన్ పై శిక్షణ ఇచ్చినట్టు చెప్పింది.

అంతకుముందు చాలా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్, రెమ్డెసివిర్ ట్యాబ్లెట్లనూ ఇచ్చి సాయం చేశామని, వాటితో పాటు టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు, గ్లోవ్స్, ఇతర వైద్య పరికరాలను అందజేశామని పేర్కొంది. చికిత్సా సామర్థ్యాలను పెంచుకునేలా పార్ట్ నర్ షిప్స్ ఫర్ యాక్సిలరేటింగ్ క్లినికల్ ట్రయల్స్ (ప్యాక్ట్) కింద పొరుగు దేశాలకు శిక్షణ ఇచ్చామని చెప్పింది.

ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద భాగస్వామ్య దేశాలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలు, పాలనాధికారులకు కరోనాపైనా శిక్షణా తరగతులు నిర్వహించామని వివరించింది. కాగా, ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్లను అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేస్తామని చెప్పింది. గావి కొవాక్స్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు టీకాలు ఇస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News