Love: ప్రేమ కన్నా చాయ్​ మిన్న.. భగ్నప్రేమికుడి చాయ్​ కొట్టు!

Dehradun Man Opens Tea Joint After Breakup Says Tea Better Than Love

  • ‘లవ్ బ్రేకప్’ టీ కొట్టు పెట్టిన డెహ్రాడూన్ యువకుడు
  • ప్రేమను ఒప్పుకోని అమ్మాయి తల్లిదండ్రులు
  • ఆరు నెలలు ప్రేయసి ఊహలతోనే బతుకు
  • తర్వాత దాచుకున్న డబ్బులతో సరికొత్తగా కెరీర్ ప్రారంభం

మనసిచ్చిన ప్రేయసి దూరమైందని చాలా మంది దేవదాసులైపోతుంటారు. విరహగీతాలు పాడుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. కొందరు ప్రేయసిపై కసి పెంచుకుని ఎంతటి అఘాయిత్యానికైనా తెగబడుతుంటారు.

కానీ, ఇవన్నీ మనకెందుకు బాస్ అంటున్నాడు డెహ్రాడూన్ కు చెందిన ఓ యువకుడు. చాలా మంది లాగానే అతడూ లవ్ లో ఫెయిలైనోడే. ‘లడకీ పోతే పోయింది.. లవ్ పోతే పోయింది’ అనుకుని కెరీర్ మీద దృష్టి పెట్టాడు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాంచి చాయ్ కొట్టు పెట్టేద్దామనుకున్నాడు. అందులో కొత్తేముంది అనుకుంటారేమో.. నిజంగా కొత్త లేకపోతే అందులో వార్తేముంటుంది?

తన టీ కొట్టు ద్వారా ‘ఈ ప్రేమ..దోమ కన్నా.. చాయే మస్తు మజా’ అంటున్నాడు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన దివ్యాన్షు బాత్రా అనే 21 ఏళ్ల కుర్రాడికి వచ్చింది ఈ లవ్ బ్రేకప్ చాయ్ కొట్టు. దాని పేరు కూడా అదేనండోయ్. ‘దిల్ టూటా ఆషిఖ్ చాయ్ వాలా (గుండె ముక్కలైనోడి చాయ్ కొట్టు)’. ఎన్నో ఏళ్ల వారి ప్రేమకు అమ్మాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. దీంతో ఎన్నేళ్లుగానో చేతిలో చెయ్యేసి చెప్పుకున్న మాటలు.. ఊసులు పటాపంచలైపోయాయి. ప్రేమ ముక్కలైపోయింది. దాని నుంచి కోలుకోవడానికి మనోడికి దాదాపు ఆరు నెలలు పట్టిందట.

ఆ టైంలోనే తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి ఓ చాయ్ కొట్టు కమ్ కేఫెను పెట్టాలనుకున్నాడు. దాచుకున్న డబ్బుతో డిసెంబర్ 16న దుకాణం తెరిచాడు. చాయ్ తో పాటు నోరూరించే మోమోస్, ఫ్రైస్ వంటి తినుబండారాలనూ తన దుకాణంలో అమ్ముతున్నాడు. చాయ్ కొట్టులోకి అడుగు పెడుతూనే ‘ప్రేమ కన్నా.. చాయ్ మిన్న’ అనే మాట కస్టమర్లకు స్వాగతం పలుకుతుందక్కడ. ‘ప్రేమ వినాశనం.. చాయ్ ఔషధం’ వంటి నినాదాలెన్నో ఆ చాయ్ కొట్టులో దర్శనమిస్తాయి.

‘‘స్కూల్ లో కలిసి చదువుకునే రోజుల దగ్గర్నుంచి మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ, వాళ్ల అమ్మానాన్నలు మా ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో గతేడాది మా ప్రేమ ముక్కలైంది. ఆరు నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. పబ్ జీ ఆడుతూ గడిపేశా. ఓ రోజు అయిపోయిందేదో అయిపోయిందనుకుని ఈ చాయ్ కొట్టు ఆలోచన చేశా’’ అని దివ్యాన్షు చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు ఈ టీ కొట్టు అక్కడ చాలా ఫేమస్. బయటే కాదు.. సోషల్ మీడియాలోనూ! నిజంగా మరి విరహ ప్రేమికులకు ఇదో గమ్యస్థానం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఈ దిల్ టూటా ఆషిఖ్ చాయ్ వాలా పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది.

  • Loading...

More Telugu News