Narendra Modi: రెండో దశలో వ్యాక్సిన్ వేయించుకోనున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు
- మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు
- రాజకీయ నాయకులు తొందర పడొద్దన్న మోదీ
- రెండో దశలో ఎంపీలు, ఎమ్మెల్యేలకూ కూడా వ్యాక్సిన్లు
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, మొదటి వ్యాక్సిన్ ప్రధాని మోదీయే వేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ ను మోదీ పట్టించు
కోలేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకేనంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ ను వేస్తున్నారు. మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయి, రెండో దశ ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ వ్యాక్సిన్ వేయించుకోనున్నారని తెలిసింది.
అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వ్యాక్సిన్ వేయించుకుంటారని సమాచారం. ప్రాధాన్య క్రమం ప్రకారం రెండో దశలో 50 ఏళ్లకు పైబడిన వారికి, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మొదట వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఆ సమయంలోనే ప్రధాని, ముఖ్యమంత్రులతో పాటు 50 ఏళ్లు పైబడిన దేశంలోని అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకూ వ్యాక్సిన్లు వేయనున్నారు.
వ్యాక్సిన్ల పంపిణీపై ఇటీవల ముఖ్యమంత్రులతో సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వ్యాక్సిన్ వేయించుకోవడంలో తొందర పడొద్దని వారికి చెప్పారు. రెండో దశలో వారికీ వ్యాక్సిన్లు అందుతాయని చెప్పారు. అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తిస్తూ వారికీ మొదటి దశలోనే వ్యాక్సిన్లు ఇవ్వాలని హర్యానా, బీహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి సూచించారు. అందుకు మోదీ ఒప్పుకోలేదని తెలిసింది. రాజకీయ నాయకులు ఎవ్వరూ మొదటి దశలో వ్యాక్సిన్లు వేయించుకోవద్దని మోదీ స్పష్టం చేశారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభంలోనే ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాక్సిన్లు వేయించుకుని ప్రజలను ప్రోత్సహించనున్నారు.