Galwan Valley: జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై గల్వాన్ అమర జవాన్ల పేర్లు
- గతేడాది జూన్ 15న గల్వాన్ లో చైనా బలగాలతో ఘర్షణలు
- 20 మంది భారత జవాన్ల వీరమరణం
- రిపబ్లిక్ డే నేపథ్యంలో కీలక నిర్ణయం
- ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంపై జవాన్ల పేర్లు
లడఖ్ వద్ద గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో భారత సాయుధ దళాలకు చెందిన 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 15న ఈ ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో, కొన్నినెలల అనంతరం ఆ అమర జవాన్ల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై లిఖించారు. మరికొన్నిరోజుల్లో రిపబ్లిక్ డే రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సైనికులకు గుర్తుగా ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారక చిహ్నం)ను 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. తొలుత అక్టోబరు 19 నుంచి 2020 సెప్టెంబరు మధ్యకాలంలో వివిధ ఘటనల్లో మరణించిన 90 మంది జవాన్ల పేర్లను ఆ స్మారక చిహ్నంపై లిఖించారు. తాజాగా గల్వాన్ లోయలో వీరోచిత పోరాటం అనంతరం కన్నుమూసిన 20 మంది జవాన్ల పేర్లను కూడా లిఖించారు.