Fire Accident: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం
- పూణేలో అగ్నిప్రమాదం
- సీరం కేంద్రంలో టెర్మినల్ 1 వద్ద చెలరేగిన అగ్నికీలలు
- వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
- నలుగురిని కాపాడిన సహాయక బృందాలు
- కరోనా వ్యాక్సిన్ నిల్వ కేంద్రం సురక్షితం
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూణేలోని మంజ్రి ప్రాంతంలో ఉన్న సీరం ప్లాంట్ లో టెర్మినల్ 1 గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సీరం కేంద్రానికి చేరుకున్నాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసిన స్టోరేజి యూనిట్ కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.
కాగా, అగ్నిప్రమాదం నేపథ్యంలో భవనంలో చిక్కుకుపోయిన నలుగురిని సహాయక బృందాలు కాపాడాయి. సహాయక చర్యలను సమీక్షిస్తున్న పూణే మేయర్ మురళీధర్ మహోల్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంతో దట్టమైన పొగలు ఆకాశాన్నంటేలా వెలువడడంతో నగర వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి కేంద్రంలో ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు.