Missing Girl: పదహారేళ్ల కిందట తప్పిపోయిన బాలికను కన్నవారి వద్దకు చేర్చిన హైదరాబాదు పోలీసులు
- 2005లో పాతబస్తీలో తప్పిపోయిన బాలిక
- అనాథాశ్రమంలో చేర్చిన స్థానికులు
- ఆపరేషన్ స్మైల్-7 చేపట్టిన పోలీసులు
- అనాథాశ్రమంలో వివరాల సేకరణ
- బాలిక తల్లిదండ్రులు కర్నూలులో ఉన్నట్టు గుర్తింపు
హైదరాబాదు పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-7 సత్ఫలితాలను ఇస్తోంది. 2005లో హైదరాబాద్ పాతబస్తీలో తప్పిపోయిన ఓ బాలిక పదహారేళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. అప్పట్లో పాతబస్తీ హుస్సేని ఆలంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డు పక్కన ఏడుస్తూ కనిపించిన బాలికను స్థానికులు మియాపూర్ ఆశ్రమంలో చేర్చారు. అప్పటినుంచి ఆ బాలిక అక్కడే ఆశ్రయం పొందుతోంది.
అయితే, ఆపరేషన్ స్మైల్-7లో భాగంగా మానవ అక్రమ రవాణా వ్యతిరేక బృందాలు మియాపూర్ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి వివరాలు సేకరించగా, సదరు బాలిక తప్పిపోయిన అంశాన్ని కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. 2005లో పాతబస్తీ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించగా, తమ కుమార్తె తప్పిపోయినట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు గుర్తించారు. వారు ఇప్పుడు కర్నూలు ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి బాలిక వివరాలను వారికి తెలియపర్చారు.
మియాపూర్ అనాథాశ్రమంలో ఉన్నది 16 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కుమార్తే అని నిర్ధారించుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాలతో తమ కుమార్తె ఆనవాళ్లను సరిపోల్చుకున్న ఆ తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం. తమ బిడ్డను తమకు అప్పగించిన పోలీసు బృందాలకు వారు వేనోళ్ల కృతజ్ఞతలు తెలుపుకున్నారు.