Vijayashanti: మన వద్ద రాముడి ఆలయాలు లేవా అంటున్న టీఆర్ఎస్ నేత ఇళ్లలో పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు వెళ్లడం ఎందుకో చెప్పాలి: విజయశాంతి
- రామమందిరం అంశంలో విద్యాసాగర్ రావు ఫైర్
- విరాళాలు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- మనకు ఉత్తరప్రదేశ్ రాముడు కావాలా అంటూ వ్యాఖ్యలు
- ఘాటుగా స్పందించిన రాములమ్మ
- దేవుళ్లకు ప్రాంతీయతత్వం అంటగడుతున్నారని ఆగ్రహం
అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. మనకు ఉత్తరప్రదేశ్ రాముడు కావాలా... ఏం, మనవద్ద రాముడి ఆలయాలు లేవా అని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. దీనిపై విజయశాంతి ట్విట్టర్ లో స్పందిస్తూ, మన వద్ద రాముడి ఆలయాలు లేవా అని టీఆర్ఎస్ నేత అంటున్నాడని, అలాంటప్పుడు ఇళ్లలోనూ పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్లకు వెళ్లడం, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకో ఆ నేత చెప్పాలని నిలదీశారు.
దేవుళ్లకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే విపరీత మనస్తత్వం టీఆర్ఎస్ నేతలకే చెల్లుతుందని, అయోధ్య రాముడు, తెలంగాణ రాముడు అంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ తమ ద్వేషాన్ని వెలిగక్కుతున్నారని, పైగా విరాళాన్ని భిక్ష అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరాధ్యభావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని ఎద్దేవా చేశారు. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్ఎస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్లకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.