KCR: నష్టాలు పెరిగిపోతున్నాయి... సీఎం కేసీఆర్ కు నివేదించిన ఆర్టీసీ అధికారులు

CM KCR review meeting with TSRTC officials

  • ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
  • బకాయిలు పేరుకుపోయాయన్న అధికారులు
  • ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉందని వెల్లడి
  • జీతాలు పెంచితే మరింత భారం పెరుగుతుందని వివరణ

తెలంగాణ ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రోడ్డు రవాణా సంస్థ పరిస్థితిని ముఖ్యమంత్రికి నివేదించారు. ఇంధన ధరలు భారీగా పెరగడం, కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం, గతంలో పేరుకుపోయిన బకాయిలు, ఇతరత్రా కారణాలతో ఆర్టీసీ ఇంకా అప్పుల్లోనే ఉందని వివరించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే సంస్థపై ఆర్థికభారం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం వంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థికభారం తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.

అప్పట్లో చార్జీలు పెంచిన సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.67 ఉందని, కానీ కొన్నిరోజుల వ్యవధిలోనే డీజిల్ ధర రూ.15 పెరిగిందని, దాంతో పెంచిన చార్జీల వల్ల ఉపయోగం లేకపోగా, ఇంధన ధర పెరగడంతో సంస్థపై ఆర్థిక భారం మరింత పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. కరోనా లాక్ డౌన్ కూడా ఆర్టీసీ నష్టాలను మరింత పెంచిందని, మరోవైపు ఉద్యోగుల జీతాలను కూడా పెంచాల్సి ఉందని, ఒకవేళ జీతాలు పెంచితే అది పెనుభారంగా మారే అవకాశముందని తెలిపారు.

ఆర్టీసీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నష్టాలను భరించే స్థితిలో లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ గట్టెక్కాలంటే రెండే మార్గాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేయడం, బస్సు చార్జీలు పెంచడం వల్లే ఆర్టీసీ గట్టెక్కుతుందని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీకి అధికంగా బస్సులు తిప్పడం, సంస్థాగత నిర్ణయాలతో ఆశాజనక ఫలితాలు వస్తున్నా, డీజిల్ ధరల పెంపు, పాత అప్పులు, లాక్ డౌన్ కష్టాలు ఆర్టీసీకి గుదిబండగా మారాయని వాపోయారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్గో సేవలు విజయవంతం కావడం పట్ల అధికారులను అభినందించారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికీ డెలివరీ ఇవ్వడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణికులకు సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News