Corona Virus: కొవిడ్ రోగికి పునరావాస కల్పనలో విఫలం.. మంగోలియా ప్రధాని రాజీనామా
- తొలి నాళ్లలో కరోనాను కట్టడి చేసినందుకు ప్రశంసలు
- కొవిడ్ సోకిన మహిళకు చికిత్స విషయంలో రాజధానిలో నిరసనలు
- తప్పని పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసిన ప్రధాని
కొవిడ్ రోగికి, ఆమె నవజాత శిశువుకి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదన్న విమర్శల నేపథ్యంలో మంగోలియా ప్రధాని ఖరేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు స్థానిక మీడియా తెలిపింది.
కొవిడ్ రోగికి, ఆమెకు పుట్టిన శిశువుకి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ రాజధాని ఉలాన్ బాతర్‌లో ప్రజలు రోడ్డుకెక్కారు. వారి నిసనలతో రాజధాని నగరం అట్టుడుకిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని తన పదవిని వీడాల్సి వచ్చింది.
నిజానికి కరోనా తొలినాళ్లలో వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసినందుకు మంగోలియా ప్రభుత్వం ప్రశంసలు అందుకుంది. అయితే, కరోనా బారినపడిన ఓ వ్యక్తి ఇటీవల రష్యా నుంచి మంగోలియాలోకి ప్రవేశించాడు. దీంతో అక్కడ వైరస్ వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం వైరస్ కట్టడి చర్యలతో ప్రభుత్వం బిజీగా ఉంది.