Pawan Kalyan: రామతీర్థం వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణం పట్టదు: పవన్ కల్యాణ్ ఆగ్రహం
- రామతీర్థానికి నేను వెళ్లలేక కాదు
- మతం అనేది చాలా సున్నితమైన అంశం
- నేను చాలా బాధ్యతగా ఉంటాను
- అందుకే నేను అక్కడికి వెళ్లట్లేదు
- వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు
వైసీపీ ఎమ్మెల్యేలు నోటికీ ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... 'మిగతా పార్టీల నేతలు తమకు ఎదురు మాట్లాడకూడదనేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలా లేదు. అయితే, ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు' అంటూ విమర్శించారు.
'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. వ్యవస్థలను బలహీన పరచకండి. మీరు మీ తీరు మార్చుకోకపోతే మేమూ మా సహనాన్ని కోల్పోతాం. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన హోదాలో ఉండి పేకాట క్లబ్బులను నడుపుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు' అంటూ ధ్వజమెత్తారు.
'మీడియాలో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా చిన్న వార్త వచ్చినా కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీన్ని ఖండించకపోతే ప్రమాదం. ఈ తీరును జనసేన ఖండిస్తోంది. ఈ తీరుని మార్చుకోకపోతే భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించి పోరాడతాం' అన్నారు.
'తిరుపతిలో తొలి పీఏసీ నిర్వహించాం. ఆలయాలపై దాడుల గురించి చర్చించాం. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. చాలా సున్నితమైన అంశం ఇది. వీటిపై మేము ఆచితూచి స్పందిస్తున్నాం. 142కి పైగా ఘటనలు జరిగాయి. ఈ పనులన్నీ వైసీపీయే చేయిస్తోందని మేము ఎన్నడూ చెప్పలేదు' అని చెప్పారు.
'అయితే, ఎలాంటి విగ్రహాల ఘటనలు జరిగినా వైసీపీ నేతలు వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదు. సెక్యులరిజం పాటిస్తోన్న మన సమాజంలో అన్ని మతాలను సమానంగా చూడాలి. ఓ చర్చి మీద, ఓ మసీదు మీద దాడి జరిగితే ఈ సమాజంలోని చాలా మంది గొంతు ఎత్తుతున్నారు. కానీ, వరుసగా 142 ఆలయాలపై దాడులు జరిగితే మాత్రం స్పందించట్లేదు. ఈ రోజు ప్రభుత్వం నిందితులను పట్టించుకోవట్లేదు. ఇతర ఏ చర్చి మీదైనా, మసీదులపైనైనా ఇటువంటి ఘటనలు జరిగితే దేశమే కాదు.. ప్రపంచం మొత్తం స్పందించేది. ఇటువంటి తీరు సరికాదు. మేము చర్చి, మసీదులపై దాడులు జరిగినా స్పందిస్తాం' అని చెప్పారు.
'రామతీర్థానికి నేను వెళ్లలేక కాదు. మతం అనేది చాలా సున్నితమైన అంశం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. మేము వెళ్లి అక్కడ ఆందోళన చేస్తే భావోద్వేగాల మధ్య పలు మతస్థులపై దాడులు జరిగితే అమాయకులు బలైపోతారని నేను ప్రకటనకే పరిమితమయ్యాను. రాముడి తలను తీసేస్తే మరో విగ్రహం పెడతామని, రథం పోతే మరికొన్ని రథాలు చేయిస్తామని వైసీపీ అంటోంది. చర్చిలపై దాడులు జరిగితే కూడా ఇలాగే అంటారా?' అని చెప్పారు.
'దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు.. మతం కంటే మానవత్వం గొప్పదని జనసేన నమ్ముతుంది. అయితే, ఆలయాలపై దాడులపై ఎవ్వరూ స్పందించకపోతే జనసేన స్పందిస్తుంది. రామతీర్థం వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పట్టదు. అయితే, గొడవలు జరుగుతాయని ఆగుతున్నాం. శాంతి, భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతోన్న తీరు బాగోలేదు' అని చెప్పారు.
'150 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంత బాధ్యతగా ఉండాలి? ఆలయాల జోలికి వచ్చేవారిని ప్రభుత్వం వదిలేసినా మేము వదలం. విగ్రహాలను మేమే పగలగొట్టామని ఓ పాస్టర్ యూట్యూబ్ లో వీడియో కూడా పెడితే వారిపై మాత్రం చర్యలు తీసుకోవట్లేదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు పెడుతున్నారు' అంటూ తీవ్రంగా విమర్శించారు.