Nitish Kumar: ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి: నితీశ్ కుమార్ కు తేజస్వి యాదవ్ సవాల్

Tejashwi Yadav Dares Nitish Kumar Over New Order
  • ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై చర్యలకు నితీశ్ ఆదేశాలు
  • నితీశ్ అవినీతి భీష్మపితామహ అంటూ తేజస్వి ట్వీట్
  • 60 కుంభకోణాల్లో నేరస్తుడని వ్యాఖ్య
బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడిన వెంటనే విపక్షాల నుంచి తొలుత తేజస్వి స్పందించారు. ట్విట్టర్ ద్వారా నితీశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'అవినీతి భీష్మ పితామహ' అంటూ నితీశ్ ని విమర్శించారు. తమరికి వ్యతిరేకంగా తాను కామెంట్ చేశానని... దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సీఎంకి సవాల్ విసిరారు.

'నితీశ్ కుమార్ 60 కుంభకోణాల్లో నేరస్తుడు, అవినీతి భీష్మ పితామహుడు, క్రిమినల్స్ ని కాపాడేవాడు, రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వంలో బలహీన ముఖ్యమంత్రి. బీహార్ పోలీసులే లిక్కర్ అమ్ముతున్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే నన్ను అరెస్ట్ చేయాలని నితీశ్ కి సవాల్ విసురుతున్నా' అని ట్వీట్ చేశారు. ప్రజలకు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతల వద్దకు ప్రజలు తమ ఫిర్యాదులను కూడా తీసుకెళ్లకుండా చేస్తున్నారని అన్నారు. 'నితీశ్ గారూ, మీకు కొంతైనా సిగ్గుండాలి' అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar
JDU
Tejashwi Yadav
RJD

More Telugu News