Elon Musk: కర్బన సంగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి 100 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించిన ఎలాన్ మస్క్
- ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు
- పర్యావరణ హితం కోసం మస్క్ ప్రకటన
- వచ్చే వారం మరిన్ని వివరాలు వెల్లడిస్తానంటూ ట్వీట్
- తన ప్రకటనతో పోటీతత్వం పెరుగుతుందని భావిస్తున్న మస్క్
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు వ్యాపార నైపుణ్యంతో పాటు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఆయన విద్యుత్ కార్ల తయారీ వెనుక ప్రగాఢమైన పర్యావరణ హితం కూడా ఉంది. తాజాగా ఆయన కర్బన ఉద్గారాల నివారణ దిశగా ఆసక్తికర ప్రకటన చేశారు. కర్బన ఉద్గారాలను సమర్థంగా సంగ్రహించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్లు (రూ.730 కోట్లు) ఇస్తానని ట్వీట్ చేశారు.
కర్బన సంగ్రహణం కోసం రూపొందించే అత్యుత్తమ విధానానికి తన బహుమతి లభిస్తుందని, దీనికి సంబంధించిన ఇతర వివరాలను వచ్చేవారం వెల్లడిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. తన బహుమతి ప్రకటన ద్వారా పోటీతత్వం మరింత పెరిగి త్వరితగతిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఈ టెస్లా అధినేత భావిస్తున్నారు.