Nimmagadda Ramesh: దూకుడు పెంచిన నిమ్మగడ్డ.. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సీఎస్ కు లేఖ
- ఎన్నికల నిర్వహణకు సహకరించని ఉద్యోగులపై చర్యలు
- గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు.. తిరుపతి అర్బన్ ఎస్పీ తొలగింపుకు సిఫారసు
- కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్ కు ఆదేశం
పంచాయతీ ఎన్నికలకు రేపు ఉదయం 10 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఇదే సమయంలో ఆయన దూకుడు పెంచారు. ఎన్నికల నిర్వహణకు సహకరించని ఉన్నతోద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.
గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను తప్పించాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్లకు ఛార్జ్ అప్పగించి, విధుల నుంచి రిలీవ్ అయ్యేలా ఆదేశించాలని లేఖలో కోరారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలతో పాటు తాడిపత్రి, రాయదుర్గం, పుంగనూరు, మాచర్ల సీఐలను తొలగించాలని పేర్కొన్నారు. వారి స్థానంలో కొత్త అధికారుల పేర్లను పంపాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. నిమ్మగడ్డ దూకుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.