Prime Minister: కోల్ కతాలో మమత భారీ ర్యాలీ.. ప్రధాని పర్యటనకు ముందే బెంగాల్ సీఎం ఎత్తుగడ
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల నిర్వహణ
- పరాక్రమ్ దివస్ కాదు.. దేశ్ నాయక్ దివస్ అన్న మమత
- జనవరి 23న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్
- ఆజాద్ హిందూ ఫౌజ్ ను నిర్మిస్తామని హామీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని.. ప్రధాని నరేంద్ర మోదీ కోల్ కతా పర్యటనకు రానున్నారు. అయితే, ప్రధాని పర్యటనకు ముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్యాం బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. నేతాజీకి ఘన నివాళులు అర్పించారు. పాదయాత్రలో మమతకు తోడుగా వేలాది మంది తరలివచ్చారు.
జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజర్హట్ ప్రాంతంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ను నిర్మిస్తామని ప్రకటించారు. అంతేగాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు ఇస్తామని తెలిపారు. నేతాజీ జయంతి గురించి తెలిసిన తమకు.. ఆయన చనిపోయిన తేదీ మాత్రం తెలియకపోవడం విచారించాల్సిన విషయమన్నారు.
ఆయన జయంతిని పరాక్రమ దివస్ గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. అసలు పరాక్రమం అంటే ఏంటని ప్రశ్నించారు. నేతాజీ దేశాన్ని ప్రేమించే వ్యక్తి అని, దేశానికి నాయకుడు అని కొనియాడారు. అన్ని కులాలు, మతాలను సమానంగా ప్రేమించారని గుర్తు చేశారు. నేతాజీ స్థాపించిన నేషనల్ ప్లానింగ్ కమిషన్ ను ఇప్పుడు లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. నేతాజీకి ఎవరి సహకారమూ అవసరం లేదన్నారు. నేతాజీని దేశ్ నాయక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారని, కాబట్టి జనవరి 23 ‘దేశ్ నాయక్ దివస్’ అని మమత అన్నారు.