Varla Ramaiah: మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య
- ఎస్ఈసీ మాట ఉద్యోగులు వినరని పెద్దిరెడ్డి అన్నారు
- ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడమే
- పెద్దిరెడ్డి రాజీనామా చేయాలి
పంచాయతీ ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. అధికారులు కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఉద్యోగులు ఎస్ఈసీ మాట వినరని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.
'సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాట వినరు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం, రాజ్యాంగ సంక్షోభం సృష్టించడమే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట తప్పిన మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా చెయ్యాలి. ముఖ్యమంత్రి ఆయనను క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి' అని ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో డీజీపీని ఉద్దేశించి కూడా వర్ల ట్వీట్ చేశారు. 'డీజీపీ సవాంగ్ గారూ! ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు బైలాస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున, ఆయనను వెంటనే సస్పెండ్ చేసి, చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యూనియన్స్ తో చేతులు కలిపే హక్కు అసోసియేషన్ కు లేదు' అని ట్వీట్ చేశారు.