Botsa Satyanarayana: చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు... మీకు పదవి ఇచ్చారనా?: ఎస్ఈసీకి బొత్స సూటి ప్రశ్న

Botsa question SEC Nimmagadda Ramesh Kumar

  • ముదురుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం
  • నోటిఫికేషన్ జారీ చేసిన నిమ్మగడ్డ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స
  • ఎవరి కోసం ఈ ప్రయత్నాలు? అంటూ మండిపాటు
  • చంద్రబాబుకు పారితోషికం చెల్లిద్దామనా? అంటూ వ్యాఖ్యలు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిలదీశారు. చంద్రబాబు మీకు పదవి ఇచ్చారనా? లేక, మీ సామాజిక వర్గానికి చెందినవాడని ఎన్నికల నిర్వహించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు మీకు బాధ్యతలు గుర్తుకు రాలేదా? ఇవాళ ఎందుకంత తొందరపడుతున్నారు? ఎన్నికలు మూడు నెలలు ఆలస్యం అయినా ఫర్వాలేదు... ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం అని బొత్స స్పష్టం చేశారు.

తాము చాలా ఎన్నికలు చూశామని, కానీ నిమ్మగడ్డ మీడియా సమావేశం చూశాక ఎంతో ఆశ్చర్యం కలిగిందని అన్నారు. ఆయన ఎస్ఈసీలా కాకుండా రాజకీయ పార్టీకి చెందిన నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే తప్పులేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం మాత్రం తప్పు అని బొత్స స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాప్తితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎన్నికలు చేపడుతూ, రేపు ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నాడని, చంద్రబాబు అధికారంలో ఉన్న వేళ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు.

గత మార్చిలో రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు కూడా లేవని, ఆ రోజున ఎవరి మాట విని స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని నిలదీశారు. ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది, పైగా వందల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి... ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని హితవు పలికారు. నోటిఫికేషన్ విడుదలకు ముందే అధికారుల బదిలీలకు ఆదేశాలిస్తున్నారు... ఐఏఎస్ శిక్షణలో మీకు నేర్పించింది ఇదేనా? అంటూ బొత్స మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు మీరు ఎందుకింత ఆరాటపడుతున్నారు? ఎవరికోసం ఈ ఆత్రుత? మీకు ఎస్ఈసీ పదవి ఇచ్చిన చంద్రబాబుకు పారితోషికం చెల్లించుకునే ప్రయత్నమా? అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు 10 శాతం సీట్లు కూడా రావు... నిమ్మగడ్డ ప్రచారం చేసినా అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబుతో నిమ్మగడ్డ లాలూచీ పడినట్టు కనిపిస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలో నిమ్మగడ్డ వంటి వ్యక్తులు ఉండడం దురదృష్టకరమని బొత్స పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News