RKS Bhadauria: ఎల్ఏసీ వద్ద చైనా తోక జాడిస్తే దీటుగా బదులిస్తాం: భారత వాయుసేన చీఫ్
- జోధ్ పూర్ లో భారత్, ఫ్రాన్స్ సంయుక్త వైమానిక విన్యాసాలు
- మీడియాతో మాట్లాడిన భారత వాయుసేన చీఫ్
- చైనా దూకుడుకు దూకుడుతోనే బదులిస్తామన్న భదౌరియా
- త్వరలో మరో 3 రాఫెల్ విమానాలు వస్తున్నాయని వెల్లడి
భారత్, ఫ్రాన్స్ వైమానిక దళాలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. డెజర్ట్ నైట్-2021 పేరిట జనవరి 20 నుంచి 24 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. ఈ సందర్భంగా భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదూరియా మాట్లాడుతూ, తమ యుద్ధ సన్నద్ధతను చాటారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా దూకుడు ప్రదర్శిస్తే తాము కూడా దూకుడుగానే బదులిస్తామని భదౌరియా స్పష్టం చేశారు. చైనాను దీటుగా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు.
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేలా ఇప్పటికే 8 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నాయని, మరో మూడు విమానాలు జనవరి చివరినాటికి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. చైనాతో గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో రాఫెల్ భారత్ అమ్ములపొదిలో చేరడంతో గగనతలంలో వ్యూహాత్మక ఆధిపత్యం లభించినట్టయింది.