Rahul Gandhi: ప్రధాని మోదీ తమిళ సంస్కృతిని అర్థం చేసుకోవడంలేదు: రాహుల్ గాంధీ
- త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
- కోయంబత్తూరులో ప్రచారం ప్రారంభించిన రాహుల్
- మోదీపై విమర్శనాస్త్రాలు
- తమిళ భాషను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచుగా ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. ఇవాళ కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తమిళ ప్రజలను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. మోదీ ఆధ్వర్యంలోని కేంద్రం తమిళ సంస్కృతిని, భాషను, చరిత్రను అణగదొక్కేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.
ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే భావన అనే మోదీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలోని ప్రజలందరూ ఒక్కరినే ఆరాధించాలని మోదీ కోరుకుంటున్నారని, అది కూడా తానే అవ్వాలని భావిస్తున్నారని అన్నారు. కానీ ఆయనకు తమిళ ప్రజల స్ఫూర్తి, సంస్కృతి, భాష అర్థంకావడంలేదని విమర్శించారు. తమిళ ప్రజలు కేవలం ప్రేమ, గౌరవం వంటి అంశాలకే స్పందిస్తారని, ఎందుకంటే తమిళులకు ఆత్మాభిమానం మెండుగా ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.