Jawans: మంచువానను కూడా లెక్కచేయకుండా తల్లి, శిశువును ఇంటికి చేర్చిన జవాన్లు... వీడియో ఇదిగో!
- బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- మంచుతుపాను కారణంగా ఆసుపత్రిలోనే చిక్కుకున్న వైనం
- భారత జవాన్ల సేవా దృక్పథం
- తల్లిని, బిడ్డను మోసుకుంటూ ఆరు కిలోమీటర్ల పయనం
సరిహద్దుల్లో ప్రాణాలకు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే జవాన్లు తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారు. జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతం లోలాబ్ కు చెందిన ఓ మహిళ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ ప్రాంతంలో తీవ్ర హిమపాతం నెలకొని ఉండడంతో ఆ మహిళ తన శిశువుతో పాటే ఆసుపత్రి వద్దే నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జవాన్లు ఆమెకు సాయపడాలని నిర్ణయించుకున్నారు.
ఆ బాలింతరాలిని కాలు కిందపెట్టనివ్వకుండా ఓ స్ట్రెచర్ పై మోసుకుంటూ వారు 6 కిలోమీటర్ల పాటు నడిచారు. మంచువానను కూడా లక్ష్యపెట్టకుండా ఎంతో శ్రమించి ఆమెను, ఆమె బిడ్డను ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. జవాన్ల సేవా నిరతిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.