Ajinkya Rahane: డ్రస్సింగ్ రూమ్ లో సహచర క్రికెటర్లను ఉద్దేశించి అజింక్యా రహానే ఏమన్నాడో చూడండి!
- బ్రిస్బేన్ లో విజయం తరువాత డ్రస్సింగ్ రూమ్ లో సమావేశం
- ఏ ఒకరిద్దరి శ్రమతోనో దక్కిన విజయం కాదన్న రహానే
- కుల్ దీప్, కార్తీక్ త్యాగిలకు భవిష్యత్తులో అవకాశం లభిస్తుందని భరోసా
గత వారంలో బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో అజింక్యా రహానే నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం తరువాత డ్రస్సింగ్ రూములో సహచర క్రికెటర్లను ఉద్దేశించి రహానే మాట్లాడగా, ఆ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది.
"ఇవి మనకు అద్భుతమైన క్షణాలు. అడిలైడ్ లో ఏం జరిగింది? మెల్ బోర్న్ కు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇది నిజంగా చాలా అద్భుతం. ఈ విజయం వెనుక ప్రతి ఒక్కరి కృషి, పట్టుదలా ఉన్నాయి. ఇది ఎవరో ఒకరో, ఇద్దరో ఆటతీరు వల్ల దక్కిన విజయం కాదు" అని అన్నాడు. ఆపై ఈ టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లోనూ అవకాశం దక్కించుకోలేకపోయిన కుల్ దీప్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ, అతను మరింతగా శ్రమిస్తుండాలని, ఏదో ఒక రోజు అతని సమయం వచ్చి తీరుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు.
కుల్ దీప్ తో పాటు కార్తీక్ త్యాగి పేరును ప్రస్తావిస్తూ, వీరిద్దరూ తమ సత్తాను చాటాలని ఎంతో ఆశతో ఉన్నారని, వారిద్దరి ఆటతీరు తనకు ప్రత్యక్షంగా తెలుసునని చెప్పిన రహానే, ఇద్దరికీ సమీప భవిష్యత్తులోనే టీమిండియాకు ఆడే అవకాశం లభిస్తుందని అన్నాడు. రహానే మాట్లాడుతున్న సమయంలో పక్కనే కోచ్ రవిశాస్త్రితో పాటు జట్టు మేనేజ్ మెంట్ సభ్యులు కూడా ఉన్నారు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోను మీరూ చూడవచ్చు.