India: ఇండియాలో 1000కిపైగా డ్యామ్ లకు పొంచివున్న ప్రమాదం... హెచ్చరించిన ఐరాస!
- మరో ఐదేళ్లలో 50 ఏళ్ల జీవితకాలం
- వాటి దిగువన కోట్లాది మంది ప్రజలు
- ప్రపంచవ్యాప్తంగా 58 వేలకు పైగా డ్యామ్ లు ప్రమాదంలో
- యూఎన్ అధీనంలోని ఇనిస్టిట్యూట్ నివేదిక
ఇండియాలోని వివిధ నదులపై నిర్మించిన 1000కి పైగా డ్యామ్ లు మరో ఐదేళ్లలో 50 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుని, ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని, ఇది ప్రపంచానికే పెను విపత్తు కావచ్చని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో హెచ్చరించింది. 20వ శాతబ్దంలో నిర్మించిన ఈ ఆనకట్టల కింద కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారని, ఎన్నో పట్టణాలు, గ్రామాలు ఉన్నాయని, వారందరి జీవితాలూ ప్రమాదంలో పడనున్నాయని పేర్కొంది.
'ఏజింగ్ వాటర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్: యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్' పేరిట కెనడా కేంద్రంగా యూఎన్ అధీనంలో పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ఈ నివేదికను వెలువరించింది. ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య 58,700 ఆనకట్టలు నిర్మితం అయ్యాయని, వీటన్నింటి వయసు 50 నుంచి 100 సంవత్సరాలు మాత్రమేనని గుర్తు చేసింది.
50 ఏళ్లు దాటిన ఏ బహుళార్ద సాధక ప్రాజెక్టు అయినా, దాని వయసు ముగిసినట్టుగానే భావించాలని పేర్కొంటూ, వీటి నిర్వహణ, మరమ్మతులు, వైఫల్యాలు సంభవిస్తే తక్షణ చర్యలకు ఆయా దేశాలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏఏ ప్రాజెక్టుల డిజైన్ లైఫ్ ముగింపు దశకు వచ్చిందో ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నివేదికలో యూఎస్ఏ, ఫ్రాన్స్, కెనడా, ఇండియా, జపాన్, జాంబియా, జింబాబ్వే తదితర దేశాల్లో నదులపై నిర్మితమైన ప్రాజెక్టులను గురించి ప్రస్తావించింది.
ఆనకట్టలను ఎంత ఉన్నతంగా, పటిష్ఠంగా నిర్మించినా, వాటికీ జీవితకాలం ఉంటుందని, ఇప్పుడున్న డ్యాముల్లో 55 శాతం... అంటే 32,716 డ్యామ్ లు జీవితకాలాన్ని ముగించే దశకు చేరుకున్నాయని వెల్లడించింది. ఇండియాలో 1,115 ఆనకట్టలు 2025 నాటికి 50సంవత్సరాల వయసుకు చేరుకుంటాయని, 2050 నాటికి 4,250 డ్యామ్ లకు జీవిత కాలం పూర్తవుతుందని తెలియజేసింది.
ఈ డ్యాముల కింద దాదాపు 35 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని, ముఖ్యంగా కేరళలోని ముళ్లపెరియార్ ఆనకట్టను నిర్మించి 100 సంవత్సరాలు దాటిందని ప్రస్తావించింది. ఈ డ్యామ్ బద్ధలైతే ఎంతో మంది ప్రాణాలు పోతాయని, దీనిపై కేరళ, తమిళనాడు అప్రమత్తంగా ఉండి, ముందే చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక యూఎస్ లోని 90,580 ఆనకట్టల సరాసరి వయసు ఇప్పటికే 56 సంవత్సరాలు దాటిందని, వీటిని పునర్నిర్మించాలంటే 64 బిలియన్ డాలర్లు అవసరమని తెలిపింది.