farmer: మీ తనయుడికి ఈ విషయం చెప్పండి: మోదీ తల్లికి రైతు భావోద్వేగభరిత లేఖ
- నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయమనండి
- ఢిల్లీ రోడ్లపై పడుకునేలా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది
- ఆందోళనల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు
- తల్లి మాటను ఎవరూ కాదనరు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దులో రైతులు పట్టువిడవకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆయన తల్లికి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు తాజాగా ఓ లేఖ రాశాడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా కుమారుడి మనసును మార్చాలంటూ మోదీ తల్లికి ఆయన విజ్ఞప్తి చేశాడు. మోదీ తల్లిగా తనకున్న అధికారాలన్నింటినీ ఆమె వినియోగించుకోవాలని ఆమె తన కుమారుడి మనసును మార్చుతారని ఆశిస్తున్నానని ఆ రైతు లేఖలో పేర్కొన్నాడు.
ఈ చట్టాలను ఎందుకు రద్దు చేయాలో వివరాలు చెబుతూ ఆ రైతు లేఖలో వివరించాడు. బాగా చలిగా ఉన్న వాతావరణంలో ఢిల్లీ రోడ్లపై పడుకునేలా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఆయన చెప్పాడు. వృద్ధులు చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఆందోళనల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని తెలిపాడు.
ఈ ఆందోళనల్లో ఇప్పటికే కొంతమంది చనిపోయారని వివరించాడు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను అదానీ, అంబానీతో పాటు బడా కార్పొరేట్లకు మేలు చేసేలా రూపొందించారని చెప్పాడు. తల్లి మాటను ఎవరూ కాదనరని, అందుకే మోదీ తల్లిగా హీరాబెన్ ఆయనకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సూచన చేయాలని ఆ రైతు కోరాడు.