Farm Laws: గణతంత్ర దినోత్సవ కవాతుకు అడ్డుతగలం.. ట్రాక్టర్​ ర్యాలీకి అనుమతినివ్వండి: పోలీసులకు రైతుల లేఖ

No Permission Yet On Farmers Tractor Rally

  • ఢిల్లీ రింగ్ రోడ్ మీదుగా ర్యాలీ తీస్తామని వెల్లడి
  • వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీకి రైతుల నిర్ణయం
  • ఈ రోజు సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశం
  • ఐదు మార్గాలపై రైతులు, పోలీసుల మధ్య ఏకాభిప్రాయం!

గణతంత్ర దినోత్సవాన ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీకి అనుమతినివ్వాలని కోరుతూ రైతు సంఘాలు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశాయి. రింగ్ రోడ్ మీదుగా జరిగే ఆ ర్యాలీలో పంజాబ్, హర్యానాల నుంచి తరలించిన వెయ్యి ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ తీయబోతున్నట్టు ఆ లేఖలో ఉందని అధికారులు చెబుతున్నారు.

రాజ్ పథ్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే కవాతకు తాము అడ్డుతగలబోమని, ర్యాలీకి అనుమతినివ్వాలని లేఖలో రైతులు కోరినట్టు చెబుతున్నారు. అయితే, దీనిపై పోలీసులు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, ఈ రోజు జరిగే సమావేశంలో తేలుస్తారని అన్నారు.

కొన్ని మార్గాలపై పోలీసులు, రైతుల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు అంటున్నాయి. రింగ్ రోడ్ మీదుగా ర్యాలీ తీసినా.. ఆ ర్యాలీ వలయాకారంలో ఉండదని, సింఘూ, టిక్రి, ఘాజీపూర్, జైసింగ్ పూర్, చిల్లా సరిహద్దుల నుంచి రైతులు ట్రాక్టర్లలో బయల్దేరుతారని, మళ్లీ అదే రోజు తిరిగి ఆందోళనలు చేసే చోటుకు వెళ్తారని అంటున్నాయి.

ఇవీ ర్యాలీ మార్గాలు

× సింఘూ సరిహద్దు నుంచి అచౌందీ సరిహద్దు
× యూపీ గేట్ నుంచి ఆనంద్ విహార్, దాస్నా, కేఎంపీ ఎక్స్ ప్రెస్ వే
× టిక్రీ నుంచి గెవారా అసౌదా, కేఎంపీ ఎక్స్ ప్రెస్ వే
× చిల్లా నుంచి ఘాజీపూర్, పల్వాల్
× జై సింగ్ పూర్ ఖేదా నుంచి మనేసార్, టిక్రీ బార్డర్


వాస్తవానికి తమకు పోలీసులు ట్రాక్టర్ ర్యాలీకి అనుమతినిచ్చారని కొందరు రైతు సంఘాల నేతలు శనివారం వెల్లడించారు. అయితే, పోలీసులు వెంటనే ఆ ప్రకటనను తోసిపుచ్చారు. రైతులు ఏ మార్గంలో ర్యాలీ తీస్తారో తమకు రాతపూర్వకంగా లేఖ అందించలేదని, దానిపై స్పష్టత వచ్చాకే ర్యాలీపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

అయితే, ప్రభుత్వం మాత్రం గణతంత్ర దినోత్సవాన ట్రాక్టర్ ర్యాలీ వద్దని తేల్చి చెబుతోంది. అది యావత్ జాతి సిగ్గుపడే చర్య అని వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లగా.. తాము జోక్యం చేసుకోబోమని చెప్పి విషయాన్ని పోలీసులకు వదిలేసింది. అయితే, 18 నెలల పాటు చట్టాల అమలును వాయిదా వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. రైతు సంఘాలు మాత్రం మొండి పట్టుదల వీడట్లేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News