UAE: గణతంత్ర దినోత్సవాన ప్రధాని మోదీకి అరుదైన కానుక
- ప్రధాని స్టెన్సిల్ చిత్రాన్ని గీసిన దుబాయ్ లోని భారత బాలుడు
- విదేశాంగ సహాయ మంత్రికి చిత్రం అందజేత
- ఆరు గంటల టైంలో మూడు అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తున్న చిత్రం
గణతంత్ర దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన కానుక అందుకోబోతున్నారు. దుబాయ్ కు చెందిన ఓ విద్యార్థి గీసిన స్టెన్సిల్ ఆర్ట్ ను బహుమానంగా స్వీకరించబోతున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ కు శనివారం ఆ చిత్రాన్ని అందజేశాడు ఆ విద్యార్థి.
ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ లో వెల్లడించారు. కేరళకు చెందిన యువ చిత్రకారుడు శరణ్ శశికుమార్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆ చిన్నారి మన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ఆరు వరుసల స్టెన్సిల్ పెయింటింగ్ లో ఆవిష్కరించాడన్నారు. నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉందని బాలుడిని కొనియాడారు.
కాగా, కేరళకు చెందిన 14 ఏళ్ల శశికుమార్.. ఆర్మీ హ్యాట్ పెట్టుకుని శాల్యూట్ చేస్తున్న మోదీ చిత్రాన్ని గీశాడు. మూడు అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తున్న ఆ చిత్రాన్ని గీయడానికి దాదాపు ఆరుగంటల టైం పట్టిందట. తొమ్మిదో తరగతి చదువుతున్న శశి.. ఇప్పటిదాకా యూఏఈ యువరాజు సహా 92 బొమ్మలు వేశాడు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గ్రాండ్ మాస్టర్ సర్టిఫికెట్ నూ అతడు గెలుచుకోవడం విశేషం.