China: ఒప్పందాన్ని తుంగలో తొక్కిన చైనా.. వద్దని చెబుతూనే తూర్పు లడఖ్ లో బలగాల పెంపు
- కొన్ని సెక్టార్లలో యుద్ధ ట్యాంకులు, సాయుధ దళాల క్యారియర్ల మోహరింపు
- ఉత్తర లడఖ్ లోని డెస్పాంగ్ లోనూ మరిన్ని చైనా బలగాలు
- దౌలత్ బేగ్ ఓల్డీకి అతి సమీపంలో పీఎల్ఏ మోహరింపులు
వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం రాజుకున్న తూర్పు లడఖ్ లో చైనా మళ్లీ బలగాలను పెంచుతోంది. ఓ వైపు బలగాలను ఉపసంహరించుకుందామని భారత్ కు చెబుతూనే మరోవైపు.. మరిన్ని బలగాలను అక్కడికి పంపుతూ వంకర బుద్ధి చూపిస్తోంది. సెప్టెంబర్ 21న నాలుగు నెలల క్రితం.. వివాదాన్ని తగ్గించేందుకు బలగాలను ఉపసంహరించుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే విషయాన్ని రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి కూడా.
కానీ, నాటి ఒప్పందాన్ని ఇప్పుడు చైనా తుంగలో తొక్కేసింది. సరిహద్దుల్లో చైనా నిర్మాణాలు చేపడుతోందని, బలగాల సంఖ్యను పెంచిందని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్ని సెక్టార్లలో నాలుగు నెలల్లో లేని విధంగా బలగాలతో పాటు యుద్ధ ట్యాంకులు, సాయుధ దళాల క్యారియర్లను చైనా మోహరించిందని, మన బలగాలకు అవి చాలా సమీపంలోనే ఉన్నాయని అంటున్నారు.
ఇటు ఉత్తర లడఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీకి అతి సమీపంలో డెస్పాంగ్ మైదానాల్లోనూ చైనా కొత్తగా బలగాలను మోహరించిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ ఓ గ్రామాన్ని కట్టిన చైనా.. అంతకుముందు సిక్కింలోని నాకూ లాలో కొన్ని నిర్మాణాలను చేపట్టింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి (పీఎల్ఏ) చెందిన బలగాలను ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది. సిక్కిం సరిహద్దుల్లో సైనికులకు భారీగా శిక్షణా కార్యక్రమాలను చైనా నిర్వహిస్తోంది.