India: ఆల్ టైమ్ రికార్డు... దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!
- రూ. 82.80కి చేరిన డీజిల్ ధర
- లీటరు పెట్రోలుకు రూ. 89.15
- 2018 తరువాత అత్యధిక స్థాయికి
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. గత కొంతకాలంగా ధరలు పెరుగుతూ ఉండటంతో, ప్రస్తుతం దేశంలోనే లీటరు డీజిల్ కు అత్యధిక ధర హైదరాబాద్ లో నమోదైంది. పెట్రోల్ విషయానికి వస్తే మాత్రం రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 89.15 కాగా, డీజిల్ ధర రూ. 82.80కి చేరుకుంది. ఈ స్థాయిలో ధరలు ఉండటం ఇదే తొలిసారి.
రెండేళ్ల నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న వేళ, నమోదైన ధరలతో పోలిస్తే, ఇప్పుడు క్రూడాయిల్ ధర తక్కువగా ఉన్నా, పన్నుల భారం కారణంగా ఇండియాలో ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇక, గడచిన నెల రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలుపై రూ. 2.10, డీజిల్ పై రూ. 2.20 మేరకు ధరలు పెరిగాయి.
గతంలో సెప్టెంబర్ 2013లో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.07తో ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరగా, అక్టోబర్ 18, 2018లో డీజిల్ ధర రూ. 82.38 స్థాయికి చేరింది. ఆ తరువాత ఆ స్థాయి ధర నమోదు కావడం ఇదే తొలిసారి. పెట్రోలు, డీజిల్ ధరల్లో 57 శాతం వరకూ పన్నుల భారం ఉండటమే ధరల పెరుగుదలకు కారణమని, వెంటనే పన్నులను తగ్గించాలని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
రానున్న బడ్జెట్ లో పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పెట్రోలియం శాఖ స్వయంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఓ లేఖ రాసిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ.. ఎక్సయిజ్, రాష్ట్ర ప్రభుత్వాల విలువ ఆధారిత పన్నుల కారణంగానే ధరలు అధికంగా మారాయని, ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే చర్యలు చేపట్టాలని సూచించింది.