Biggbash: ఒకే బాల్, ఒకే ప్లేయర్ రెండు సార్లు రన్నౌట్... బిగ్ బాష్ లీగ్ లో ఆశ్చర్యకర ఘటన!
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్
- అడిలైడ్, సిడ్నీ సాండర్స్ మధ్య మ్యాచ్
- వైరల్ అవుతున్న వీడియో
క్రికెట్ లో ఒక్కోసారి ఎన్నో సరదా సంఘటనలు జరుగుతుంటాయి. అద్భుతమైన విన్యాసాలతో నమ్మశక్యం కాని క్యాచ్ లు పట్టుకోవడం, బౌండరీ నుంచి బాల్ విసిరితే బెయిల్స్ పడిపోవడం, ధోనీ వంటి కీపర్ వెనక్కు తిరిగి చూడకుండా వికెట్లు గిరాటేయడం వంటివి ఎన్నో చూశాం. కానీ ఈ ఘటన మాత్రం ఇంకా వినూత్నమైనది. ఒకే ప్లేయర్, ఒకే బాల్ కు రెండు సార్లు రన్ అవుట్ అయ్యాడు. అది కూడా రెండు వైపులా. ఇటువంటి ఘటనకు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ టీ-20 క్రికెట్ లీగ్ వేదికైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే,
నిన్న అడిలైడ్ స్ట్రయికర్స్, సిడ్నీ థండర్స్ మధ్య 51వ టీ-20 మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా అడిలైడ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. జట్టు తరఫున ఆడుతున్న జెక్ వెదరాల్డ్, 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో క్రిస్ గ్రీన్ 10వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో స్ట్రయికింగ్ లో ఉన్న క్రిస్ గ్రీన్ బంతిని నేరుగా బౌలర్ వైపు ఆడాడు. ఆ సమయంలో నాన్ స్ట్రయికర్ గా ఉన్న జేక్, క్రీజు దాటి బయటకు రాగా, ఆ బంతి, బౌలర్ చేతిని రాసుకుంటూవెళ్లి, వికెట్లను తాకింది.
ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో జేక్ అయోమయంలో ఉండగానే, సింగిల్ కోసం ఫిలిప్ కాల్ చేశాడు. ఆపై స్పందించిన జేక్, పరుగు ప్రారంభించగా, బంతిని అందుకున్న ఫీల్డర్ దాన్ని కీపర్ కు చేరవేయడం, జేక్ క్రీజులో బ్యాట్ పెట్టేలోగానే వికెట్లు పడిపోవడం జరిగిపోయింది. దాని తరువాత అంపైర్లు రీప్లేను పరిశీలించగా, జేక్ రెండు వైపులా రన్నౌట్ అయినట్టు తేలింది. తొలుత అవుట్ అయిన పరిస్థితులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అంపైర్లు, ఆ వికెట్ ను క్రిస్ గ్రీన్ ఖాతాలో చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, సిడ్నీ ఛేంజర్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి, 153 పరుగులకు పరిమితమైంది. దీంతో అడిలైడ్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించినట్లయింది.