E-EPIC: డిజిటల్ రూపంలో ఓటర్ గుర్తింపు కార్డులు.. నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి

Voter ID Cards to Go Digital on Monday

  • నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
  • ఈ-ఈపీఐసీ విధానాన్ని తీసుకొస్తున్న ఎన్నికల సంఘం
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందే అందుబాటులోకి
  • మొబైల్, కంప్యూటర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరు గుర్తింపు కార్డు ఈ-వెర్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు ఈ-ఈపీఐసీ కార్యక్రమాన్ని ప్రారంభించి కొందరికి కార్డులు అందించనున్నారు. ఫలితంగా ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డులు డిజిటల్ విధానంలోకి మారిపోనున్నాయి.  అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.

రెండు దశల్లో ఈ-ఎపిక్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 25-31 మధ్య తొలి దశ ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రెండో దశ ప్రారంభం అవుతుంది. తొలి దశలో ఓటరు కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, ఫామ్-6లో తమ మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేసుకున్న వారు డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  అయితే, ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారి మొబైల్ నంబర్లు గతంలో ఈసీఐ ఎలక్టోరల్ రోల్స్‌లో నమోదు చేసినవై ఉండకూడదని అధికారులు తెలిపారు. రెండో దశలో సాధారణ ఓటర్లు ఈ-ఈపీఐసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజిటల్ ఓటరు ఐడీ కార్డు  సవరించడానికి వీలు లేకుండా, సురక్షిత పోర్టుబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పీడీఎఫ్) వెర్షన్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, సీరియల్ నంబరు, పార్ట్ నంబరు ఉంటాయని, సురక్షితమైన క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని మొబైల్‌లో కానీ, కంప్యూటర్ ద్వారా కానీ డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవచ్చు.

  • Loading...

More Telugu News